Venkaiah Naidu in Bhashyam Institutions Felicitation: కులమతాల కుమ్ములాటలో పాల్గొని.. యువత జీవితం పాడు చేసుకోవద్దు: వెంకయ్యనాయుడు - Venkaiah Naidu addressed the students
Students Achieved Ranks in IIT were Felicitated:ప్రపంచ శాస్త్ర విజ్ఞానంలో మన శాస్త్రవేత్తలు అగ్రగాములుగా ఉన్నారని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐఐటీ ఫలితాల్లో ఆలిండియా 5వ ర్యాంకర్ ఏవి శివరాం, 10వ ర్యాంకర్ వైవి మణిందర్ రెడ్డికి గుంటూరు భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను సన్మానించారు.. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇలాంటి వారిని సన్మానించటం మిగతా విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందన్నారు. యువతే ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తని.. కులమతాల కుమ్ములాటలో దూరి జీవితం పాడు చేసుకోవద్దని హితవు పలికారు. తోటి మనుషులతో పాటు ప్రకృతిని ప్రేమించాలని సూచించారు. నదులు, చెరువులు, కుంటల ఆక్రమణల్ని అడ్డుకోవాలన్నారు. చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో శాస్త్రవేత్త సత్తా ప్రపంచానికి తెలిసిందని.. ఒక్క అంతరిక్ష రంగంలోనే కాకుండా చాలా రంగాల్లో భారతీయులు మన ప్రతిష్ట పెంచారని వివరించారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా తయారు చేయటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సాంకేతికత ప్రజలకు అవసరమే అయినా.. పూర్తిగా దానిమీదే ఆధారపడొద్దని విద్యార్థులు, యువతకు సూచించారు.