Veligonda Project Victims Protest: సమస్యలు పరిష్కరించాలని.. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళన
Veligonda Project Victims Protest at Markapuram Sub Collector office: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు బాధితులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామాల్లో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండి.. దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ముంపు గ్రామాల ప్రజలు వాపోయారు. 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన వారిని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని నిర్వాసితులు ఆవేదన చెందారు. గ్రామాలకు వచ్చిన అధికారులకు వందల సార్లు సమస్యలు చెప్పి వినతి పత్రాలు ఇచ్చామని.. అవన్నీ చెత్త బుట్ట పాలవుతున్నాయే తప్ప సమస్యలు మాత్రం తీరడం లేదన్నారు. తమకు పరిహారం నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీలకు భూములు కేటాయించి ఆదుకోవాలన్నారు. ముంపు బాధితులకు రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేయడం సిగ్గు చేటన్నారు. కార్యాలయం ఎదుట నినాదాలు చేసిన తర్వాత సబ్ కలెక్టర్ సేదు మాధవన్‌కు వినతి పత్రం అందజేశారు.