ఎన్నికలొస్తున్నాయని ప్రజలను మోసం చేసేందుకు పాతమిత్రులంతా ఏకమయ్యారు: సీఎం జగన్ - వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి జగన్ శంకుస్థాపన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 15, 2023, 8:25 PM IST
Varikapudisela Irrigation Project Foundation Stone Laid by CM Jagan :ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మోసం చేసేందుకు పాతమిత్రులంతా మళ్లీ ఒక్కటయ్యారని.. మేనిఫెస్టోలు, హామీల పేరిట జిమ్మిక్కులు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) విమర్శించారు. గతంలో కలిసి పోటీ చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పల్నాడు జిల్లా మాచర్లలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సీఎం జగన్.. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
CM Jagan on TDP Government :కృష్ణమ్మ చెంతనే ఉన్నా.. పల్నాడు జిల్లాలో గుక్కెడు తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని.. ప్రజల దాహర్తిని తీర్చేందుకే వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. గత పాలకులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావుడిగా ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పల్నాడు గడ్డను అభివృద్ధికి అడ్డాగా మారుస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Jagan Comments on Chandrababu :చంద్రబాబుకు సంక్షేమం అంటేనే పట్టదని.. ఆయన ఎప్పుడూ వర్తమానం గురించి కాకుండా 50 ఏళ్లు ముందు ఆలోచిస్తానంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తారని జగన్ ఎద్దేవా చేశారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు.