Chilli Crop: అకాల వర్షం.. మిర్చి రైతులకు తీరని నష్టం
Mirchi Farmers: ఎన్టీఆర్ జిల్లాలో అకాల వర్షాలు తమను నట్టేట ముంచేశాయని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికందే సమయంలో వర్షాలు పడటం వల్ల కోసిన మిర్చి పంట అంతా తడిసిపోయిందని వాపోతున్నారు. చాలా వరకు మిర్చి రాలి.. నేలపాలైందని అంటున్నారు. వర్షాల కారణంగా కూలీలు కూడా సరిగా రావటం లేదని తెలిపారు. ఒకరిద్దరు వచ్చినా.. వారు ఎక్కువ కూలీ అడుగుతున్నారని అన్నారు. ఈ మిర్చి పంటపై లక్షల రూపాయలను అప్పుగా తీసుకు వచ్చి పెట్టుబడిగా పెట్టామని తెలిపారు. మరికొంతమంది తాము ఇంట్లో ఉన్న బంగారమంతా తాకట్టు పెట్టి చేతులు అరిగిపోయేలా పంటకు పురుగుమందులు పిచికారి చేశామని పేర్కొన్నారు. ఇలా మందులు, కూలీల ఖర్చు కలిపి లక్షల రూపాయల్లో పంటపై పెట్టామని, ఇప్పుడు తమకు పెట్టుబడైనా వస్తుందో లేదో తెలియటం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టూ ఫేస్.