వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి - ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ధ్వంసం - వైసీపీ ఎమ్మెల్యే వర ప్రసాదరావు నివాసం వద్ద దాడి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 3:05 PM IST
Unidentified Person Entered MLAs House: నెల్లూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యే నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న వైసీపీ ప్లెక్సీలను చించివేశాడు. అంతటితో ఆగకుండా.. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. అయితే ఇదంతా వైసీపీలో జరుగుతున్న వర్గపోరు అని స్థానికంగా చర్చ జరుగుతుండగా.. ఘటనపై ఎమ్మెల్యే స్పందించి స్పష్టతనిచ్చారు.
అసలేం జరిగిందంటే.. జిల్లాలోని గూడురు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వర ప్రసాదరావు నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఆ సమయంలో అక్కడ ఎమ్మెల్యే లేకపోగా.. ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడే ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను చించివేసి నానా హంగామా చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని వివరించాడు. అంతే తప్ప.. వేరే ఏ ఇతర కారణాలు లేవని స్పష్టం చేశారు.