2000 Notes Exchange Fraud: నోట్ల మార్పిడి మోసం.. 80 లక్షలతో ముఠా ఉడాయింపు..! - Notes Exchange Fraud
2000 Notes Exchange Fraud: గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘరానా మోసం వెలుగు చూసినట్లు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. నాలుగు రోజుల క్రితం తాడేపల్లికి చెందిన నలుగురు సభ్యుల ముఠా.. 2 వేల నోట్లు తమ వద్ద కోటి రూపాయిలు ఉన్నాయని.. 500 రూపాయల నోట్లతో 80 లక్షలు ఇస్తే కోటి ఇస్తామని మంగళగిరి మండలం నవులూరుకు చెందిన ఓ వ్యక్తిని నమ్మించారు. 20 లక్షలు అదనంగా వస్తున్నాయనే ఆశతో సదరు వ్యక్తి 80 లక్షలు తీసుకొని మంగళగిరి ఎన్నారై కూడలి వద్ద ముఠా కోసం ఎదురుచూశాడు. డబ్బులు తీసుకునేందుకు వచ్చిన ముఠా సభ్యులు మాస్కులు ధరించి అతన్ని అక్కడ నుంచి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కృష్ణాయపాలెం సమీపంలో డబ్బులు తీసుకుని వదిలిపెట్టారు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టింది. దీనిపై స్పందించిన మంగళగిరి డీఎస్పీ అలాంటి ఘటన ఏదీ జరగలేదని.. బాధితులు ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. బాధితుల కథనం మేరకు మోసానికి పాల్పడిన ముఠా నకిలీ రెండు వేల నోట్లు చూపించి తమ వద్ద ఉన్న 80 లక్షలు తీసుకెళ్లారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు నకిలీ నోట్లు తెచ్చిన ముఠా సభ్యులంతా ఒక్కటేనని బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారిలో కీలక వ్యక్తిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.