పండగ పూట విషాదం - వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు యువకులు మృతి - ELECTRIC SHOCK
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 15, 2024, 10:18 PM IST
Two People Died While Setting Up YSRCP Flexi: సంక్రాంతి పండగ పూట ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉండాల్సిన వారు విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందిన విషాదకర ఘటన అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చంద్రయ్యపేట గ్రామంలో జరిగింది. వైసీపీ కార్యక్రమానికి సంబంధించిన ఏ ఫ్లెక్సీని గ్రామానికి చెందిన సురేష్, ఎర్రినాయుడు పలువురు యవకులతో కలిసి కడుతున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు ప్లెక్సీ తాకింది.
దీంతో ఒక్కసారిగా ఫ్లెక్సీ బిగిస్తున్న సురేష్, ఎర్రినాయుడు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ఇద్దరు యువకులు జీవీఎంసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్నట్లు స్థానికులు చెప్పారు. ఇద్దరికీ వివాహం అయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది.