TTD Trust Board Meeting Decisions : తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు.. ధర్మకర్తల మండలి నిర్ణయం - తితిదే ఛైర్మన్ భుమన కరుణాకర్‌రెడ్డి ఫోటోలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 5:38 PM IST
TTD Trust Board Meeting Decisions: తితిదే బడ్జెట్ నుంచి ఏటా తిరుపతి నగర అభివృద్ధికి ఒకశాతం నిధులు సీఎస్ఆర్ (CSR) కింద ఇవ్వాలని తితిదే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య భవన్‌లో తితిదే ధర్మకర్తల మండలి సమావేశమైంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం 18 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డులో శాశ్వత దర్శన క్యూలైన్లు, ఫుడ్ కౌంటర్లు, షెడ్లు నిర్మాణం చేపట్టనున్నారు. తితిదేలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 12 వేల రూపాయల నుంచి 17 వేలకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్లతో నాలుగులైన్ల రోడ్డుమార్గం వేయడానికి తితిదే బోర్డు నిర్ణయం తీసుకుంది. అలిపిరి వద్ద గోశాలలో నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. 63 ఏళ్ల క్రితం నిర్మించిన కాటేజీలు, విశ్రాంతి గృహాలను తొలగించి వాటి స్థానంలో కాటేజీ డొనేషన్ స్కీమ్ క్రింద కొత్త భవనాల నిర్మాణానికి దాతలకు స్థలం కేటాయిస్తామన్నారు. రూ.10.80 కోట్లతో వరాహస్వామి అతిథి గృహం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మించనున్నట్లు తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.