TTD EO Dharma Reddy: "దేశంలోనే అత్యుత్తమైనదిగా శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి" - అలిపిరి
TTD EO Dharma Reddy on Padmavathi Childrens Hopsital: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తయారవుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి పనులను ఆయన నేడు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం సేకరించిన ప్రదేశంలో ఉన్న రుయా ఆసుపత్రిలోని క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్స వార్డును పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నందువల్ల ఈ వార్డును తాత్కాలికంగా మరో చోటికి తరలించాలని రుయా అధికారులకు ఆయన సూచించారు. స్థలం గుర్తించి కొత్త బిల్డింగ్ నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఈవో ఆదేశించారు.
ఈ ఏడాది డిసెంబర్లో ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. అనుకున్న గడువు ప్రకారమే నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ఆస్పత్రి ప్రపంచంలోని ఉత్తమ ఆసుపత్రుల సరసన చేరిందని ఈవో వివరించారు. ఇప్పటి వరకు 1450 గుండె ఆపరేషన్లు నిర్వహించి పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించినట్లు ఆయన తెలిపారు. జీవన్ దాన్ కింద నాలుగు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రిలో చిన్న పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు న్యూరో, న్యూరో సర్జరీ, పల్మనాలజి, యూరాలజి తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.