Calf Birth by Surrogacy: రాష్ట్రంలో మొట్టమొదటి సరోగసి దూడ జననం.. - తితిదే లేటెస్ట్ న్యూస్
TTD EO Dharma Reddy Visited Surrogacy Calf: సరోగసి పద్ధతి ద్వారా దూడ జన్మించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పిండ మార్పిడి చేసిన ఆవు సాహివాల్ జాతి పెయ్య దూడకు జన్మనిచ్చిన నేపథ్యంలో తిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలను ఆయన సందర్శించారు. ఆవు, దూడను పరిశీలించి.. వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేశీయ ఆవుల ఉత్పత్తి కోసం ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. దేశీయ గోజాతి అభివృద్ది కోసం 3.8 కోట్ల రూపాయలు ఎస్వీ పశు వైద్య విశ్వ విద్యాలయానికి కేటాయించామని అన్నారు. దేశీయ ఆవుల పాలతో శ్రీవారి, అమ్మవారి అభిషేకాలకు.. నెయ్యి తయారీ చేయాలన్నది ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యంలో వీటిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గో ఆధారిత వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయం విజయవంతంగా అమలు చేసి మొదటి ఫలితాన్ని తీసుకువచ్చింది అని అన్నారు. సరోగసి ద్వారా ఏడాదికి 94 ఆవులు.. దూడలను పుట్టించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోజుకు 2,500 లీటర్లు పాల కోసం 500 దేశీయ ఆవులు అవసరముందన్నారు. ఐదుగురు దాతలు 500 ఆవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. గో ఆధారిత పశుగ్రాసం తయారు చేసేందుకు జిల్లా రైతులకు అవకాశం ఇస్తామన్నారు. స్వదేశీ ఆవుల సంతతి పెంచుకోవాల్సిన అవశ్యకత ఉందని ఎస్వీ వెటర్నరీ యునివర్సిటీ వీసీ పద్మనాభ రెడ్డి తెలిపారు. ఐవీఎఫ్ టెక్నాలజీ విధానంలో ఒక ఆవు ద్వారా పది నుంచి 15 వరకు పిండాలు సేకరించి అద్దె గర్భం ఆవుల్లో ప్రవేశ పెడుతున్నామన్నారు. 530 ఆవు దూడలను సరోగాసి ద్వారా అభివృద్ది చేసి తితిదేకు అప్పగిస్తామన్నారు.