Tribal People problems: తప్పని డోలిమోతలు.. బైక్‌కు కర్రలు కట్టి ఒడ్డుకు చేర్చిన గిరిజనులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 12:00 PM IST
Tribal People problems: గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా వంతెన నిర్మాణంలో ఉండటంతో.. నిత్యం కష్టాలు పడుతున్నారు. అల్లూరి జిల్లాలోని గిరిజనులకు డోలిమోతల బాధ తప్పడం లేదు. ఆకస్మికంగా పడుతున్న వర్షాలకు కొండవాగులు ఒక్కసారిగా పొంగి ప్రవహిస్తున్నాయి. జి. మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ కోడిమామిడి గడ్డ వద్ద వర్షానికి వాగు పొంగింది. దీంతో ద్విచక్ర వాహనాన్ని వాగు దాటించేందుకు కర్రలు కట్టి డోలీలా మోశారు. వాగు చివరన ఎత్తుగా ఉండటంతో అతి కష్టం మీద బైక్ను ఒడ్డుకి చేర్చారు.
ఒక్కసారిగా పడుతున్న చిన్నపాటి వానలకే కొండవాగులు పొంగుతుండటంతో.. వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నామని.. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న వంతెన పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఏళ్ల తరబడి సాగుతున్న వంతెన పనులు త్వరగా పూర్తిచేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాగులు పొంగుతున్న కారణంగా నిత్యం నరకం చూస్తున్నామని.. వంతెనను పూర్తి చేస్తే తమ కష్టాలు తీరుతాయని గిరిజనులు అంటున్నారు.