CM Jagan Tour On June 1st: జగనన్న వస్తున్నాడు.. మళ్లీ చెట్లు నరికారు.. ఈసారి ఎక్కడంటే..! - కర్నూలు జిల్లా వార్తలు
Trees Cut Down For CM Jagan Tour: అన్నొస్తున్నాడంటే చాలు.. చెట్టుపై వేటు పడాల్సిందే.. నీడను ఇచ్చే పచ్చని వృక్షాలు నేలకూలాల్సిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు చెప్పి అధికారులు పచ్చదనానికి పాతర వేస్తున్నారు. అలాగే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ మళ్లింపులు.. గత 2, 3 రోజులుగా పత్తికొండ పట్టణంలో నెలకొన్న పరిస్థితి ఇది.
జూన్ 1వ తేదీన రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి రానున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో సుందరీకరణ, సౌకర్యాల కల్పన పేరుతో అధికారులు హడావుడి చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ కూడలి వరకు చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్నిచోట్ల కొమ్మలు, మరికొన్ని చోట్ల చెట్లనే నరికేస్తున్నారు. 50 ఏళ్ల వయసున్న సుమారు 20 చెట్లు తొలగించేశారు. దీంతో పాత బస్టాండ్ మార్గంలో కళ తప్పింది. సీఎం పర్యటన కోసం భారీ వృక్షాలు తొలగించాల్సిన అవసరం ఏముందని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొందరి ఇళ్ల వద్ద పెంచుకున్న చెట్లను కూడా తొలగించడం విమర్శలకు దారి తీస్తోంది.