Tragedy Incident in Karampudi: పల్నాడు జిల్లా కారంపూడిలో విషాదం..బిడ్డకు జన్మనిచ్చిన ఆస్పత్రికే భర్త మృతదేహం - Tragedy Incident in Karampudi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2023, 6:36 PM IST
|Updated : Oct 22, 2023, 7:19 AM IST
Tragedy Incident in Karampudi: పల్నాడు జిల్లా కారంపూడిలో మాటలకందని విషాదం చోటు చేసుకుంది. భార్యకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించిన భర్త.. వైద్యం కోసం డబ్బు తెచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు. 3 గంటలు 3 ఆస్పత్రుల చుట్టూ తిరిగి నరకయాతనపడిన గర్భిణి.. చివరకు బిడ్డను ప్రసవించిన సమయానికి ఆస్పత్రికి భర్త మృతదేహం చేరడంతో ఇరుకుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలు ఏం జరిగిందంటే.. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గర్బిణి భర్త ఆనంద్..రాత్రి 10గంటలకు కారంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు లేకపోవటంతో 108లో గురజాల ఆసుపత్రికి తరలించాడు. గురజాలలో వైద్యులు ఉన్నప్పటికీ.. కాన్పు కష్టంగా ఉందని.. తాము ప్రసవం చేయలేమని చెప్పారు. దాంతో భార్యను నరసరావుపేట తీసుకెళ్లిన్న భర్త ఆనంద్..ఆసుపత్రిలో డబ్బులు అవసరపడతాయని, తాను కారంపూడి వెళ్లి తెచ్చుకుంటానని చెప్పి వెళ్లారు. కారంపూడి నుంచి నరసరావుపేట బయలుదేరి.. కొంత దూరం రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆనంద్‌ను గమనించిన 108 సిబ్బంది నరసరావుపేటకు తరలించారు. అప్పటికే ఆయన భార్య నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో రోడ్డుపై గుంతలు ఉండటంతో ద్విచక్రవాహనం పడిపోయి ఆనంద్ మృతిచెందాడని అతని స్నేహితులు తెలిపారు. వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని సొంత జిల్లా పల్నాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహించారు.