Moharram celebrations: మొహర్రం వేడుకల్లో అపశ్రుతి.. నిప్పుల గుండంలో పడిన వ్యక్తి - ఉరవకొండ ప్రభుత్వాసుపత్రి
Moharram celebrations: పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. సంబురాల్లో మునిగితేలుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి గ్రామంలో మొహరం వేడుకలలో అపశృతి చోటు చేసుకుంది. పీర్ల పండుగ సందర్భంగా పీర్ల చావిడి ఎదురుగా తీసిన పీర్లు అగ్నిగుండం దాటే సమయంలో భక్తులు కూడా నిప్పుల మీదుగా నడిచి అటువైపు వెళ్లడం అనాదిగా వస్తోంది. అలా అందరూ వెళ్లి నిప్పుల గుండం దాటుతుండగా వన్నురప్ప అనే వ్యక్తి కాలుజారి నిప్పుల గుండంలో పడిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని బయటికి తీసినా.. అప్పటికే కాళ్లు, చేతులు కాలిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడిని వెంటనే హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కాగా వన్నూరప్ప నిప్పుల గుండంలో పడే వీడియోను గ్రామస్తులు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.