Traffic Problems: తుళ్లూరులో సీఎం సభ.. 200 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ మళ్లింపు
Traffic Diverted Due to CM Jagan Meeting: ఆర్ 5 జోన్‌లో పట్టాల పంపిణీకి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సభకు.. ట్రాఫిక్ మాత్రం 200 కిలోమీటర్లు నుంచే మళ్లించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం.. అమరావతిలోని ఆర్ 5 జోన్ ప్రాంతంలో నిర్వహించారు. ఈ సమయంలో జాతీయ రహదారి మీద భారీ వాహనాలు వెళ్లకూడదంటూ ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మళ్లించటంతో వాహనచోదకులు ఇబ్బందులు పడక తప్పలేదు.
అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేయగా.. అది జాతీయ రహదారికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరంలో సభ ఏర్పాటు చేసినా ఆ జాతీయ రహదారిలోని వాహనాల రాకపోకలకు సైతం ఆంక్షలు విధించారు. సభ వేదికకు దూరమైనా.. వాహనాలు అటూ రాకుండా ఒంగోలు నుంచి చీరాల మీదుగా హనుమాన్ జంక్షన్‌కు చేరేలా వాహనాలను మళ్లించారు. ఇలా దారి మళ్లించటం ద్వారా వందల కిలోమీటర్ల అదనంగా వెళ్లాల్సి వచ్చిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై-విజయవాడ జాతీయ రహదారి మీదుగా వెళ్లే మరికొన్ని భారీ వాహనాలు మార్టూరు మండలం బొల్లాపల్లి, మేదరమెట్ల వద్ద రెస్ట్ ఏరియాలో నిలిపివేశారు. ముఖ్యమంత్రి సభకు ట్రాఫిక్‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు ఇలా ట్రాఫిక్ మళ్లించడం అన్యాయమని పేర్కొంటున్నారు.