సమయస్ఫూర్తితో సీపీఆర్.. యువకుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ - ఏపీ తాజా వార్తలు
TELANGANA TRAFFIC POLICE SAVE ONE LIFE: ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి ప్రజలకు ఏ విధమైన అంతరాయం కలగకుండా, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు అహర్నిశలు విధులు నిర్వహిస్తుంటారు. ప్రజలకు సేవ చేయడం వారికి ఎనలేని ఆనందం ఇస్తుంది. ఎవరికైనా కష్టం వస్తే తమ శక్తికి మించి సాయం చేస్తారు.
ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు తమ విధులను నిర్వహిస్తూనే ప్రజల ప్రాణాలు కాపాడుతూ ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తా వద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక యువకుడికి ట్రాఫిక్ పోలీస్ అత్యవసర చికిత్స అందించి యువకుడి ప్రాణాలు కాపాడాడు. ఎల్బీనగర్ కి చెందిన బాలాజీ ఎల్బీనగర్ నుండి ఆరాంఘర్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చి, ఆరంగర్ చౌరస్తాకి రాగానే గుండెపోటుతో కుప్పకూలాడు. అరాంఘర్ చౌరస్తా వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ వెంటనే విషయాన్ని గమనించి యువకుని వద్దకు వెళ్లి అంబులెన్స్‌కు సమాచారం అందజేసి అంబులెన్స్ వచ్చే వరకు చాతిపై గట్టిగా ప్రెస్ చేసి, అత్యవసర చికిత్స అందచేసి యువకుడి ప్రాణాలు కాపాడాడు.
అనంతరం యువకుడిని చికిత్స నిమిత్తం అత్తాపూర్ జర్మన్ టెన్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితుల్లో యువకుడికి ప్రాథమిక చికిత్స అందజేసి యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్‌ను ట్రాఫిక్ సీఐ శ్యామ్ సుందర్‌తో పాటు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, మంత్రి హరీష్ రావు రాజశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.