అంగన్వాడీలకు కార్మిక సంఘాల మద్దతు - 9న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 3:41 PM IST
Trade Union Leaders Support to Anganwadi Workers :అంగన్వాడీ సిబ్బంది తమ డిమాండ్లను నెర వేర్చాలని గత 20 రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. తాజాగా అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల రాష్ట్ర నాయకులు ఈ నెల 9 తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్రశిక్షలో పని చేస్తున్న ఉద్యోగులు పోరాడుతుంటే వారి డిమాండ్లు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని కార్మిక నేతలు నిప్పులు చెరిగారు.
Anganwadi Workers Protest in AP :కనీస వేతనం ఇచ్చే వరకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించే వరకు కార్మికులు, ఉద్యోగులు సమ్మె విరమించరని కార్మిక నేతలు స్పష్టం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలు, సొంత చెల్లెల నుంచే తిరుగుబాటు మొదలయ్యిందని తెలిపారు. లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే సమస్యలు పరిష్కారం చేయకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నెల ఐదులోగా విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని కార్మిక నేతలు పేర్కొన్నారు.
అంగన్వాడీలకు నోటీసులు: ఈనెల 5 లోగా విధులకు రావాలని అంగన్వాడీలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. విధులకు హాజరు కాకుంటే శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్వాడీలకు నోటీసులు పంపారు. ప్రభుత్వ విజ్ఞప్తి పేరుతో నోటీసులు పంపిన ప్రభుత్వం, సమ్మె వల్ల ఇబ్బందులను నోటీసులో వివరించారు. అంగన్వాడీలకు పూర్తి చేసిన హామీలను వివరించారు.