Yanam Tourism: యానాంలో పర్యాటకుల సందడి.. వేసవి తాపం నుంచి ఉపశమనానికి - latest telugu news
Yanam Beach: యానాంలో పర్యాటకుల సందడి మొదలైంది. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇటీవలే పదో తరగతి, ఇంటర్ పరీక్షల ముగిశాయి. ఈ నేపథ్యంలో యానాంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. యానాం భౌగోళికంగా కాకినాడ జిల్లాలో ఉన్న పుదుచ్చేరికి చెందినదే. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పర్యాటక ప్రాంతంగా యానాం నెలవు. అయితే టూరిస్టుల కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గోదావరి తీరాన సేద తీరేందుకు బెంచీలు, వాటర్ ఫౌంటేన్, ఫ్రెండ్లీ పోలీస్ పార్క్ లాంటి ప్రదేశాలు పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి విశ్రాంతి లేకుండా గడుపుతున్న ఉరుకులు, పరుగుల జీవితంలో.. సేద తీరాలనే ఆలోచన ఇటీవల చాలా మందిలో పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రజలు పర్యాటకం వైపు మొగ్గు చూపుతున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతో పర్యాటక ప్రదేశాలను అన్వేషించి.. అక్కడికి చేరుకుని వాతావరణంలోని అహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు ఏర్పాట్లను వారికి తగిన విధంగానే చేస్తున్నాయి. ఇలానే యానాంలో పర్యాటకుల కోసం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. సాయం కాలం వేళ గోదావరి తీరంలో సేద తీరేందుకు, నదిలో బోటు షికారు కోసం పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. రాజీవ్ గాంధీ బీచ్ సందర్శకులతో కళకళలాడుతోంది. గోదావరి నది అవతల ఒడ్డున పచ్చని కొబ్బరి తోటలను.. బోటులో షికారు చేస్తూ వీక్షించేందుకు పర్యాటకులు తహతహలాడుతుంటారు. గోదావరిలో బోటు షికారు, సాయంత్రం సుర్యాస్తమయం వీక్షణ ప్రత్యేకమైన మధరానుభూతులను ఇస్తుంటాయి. సుమారు రెండు కిలో మీటర్ల పొడవున్న ఇక్కడి తీరం.. భరతమాత, జీసస్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.