సుడిగాలి బీభత్సం - అతలాకుతలమైన రాజమహేంద్రవరం - రాజమహేంద్రవరంలో సుడిగాలి బీభత్సం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 10:18 PM IST
Tornado Disaster in Rajamahendravaram: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. వై-జంక్షన్, వీ ఎల్ పురం, మోరంపూడి, హుకుంపేట, ప్రకాశంనగర్, దానవాయిపేట, ఆర్ట్స్ కళాశాల పరిసరాలు, వై జంక్షన్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. భీకరమైన గాలి వీయడంతో నివాసాలు, దుకాణాలపై ఉన్న రేకులు గాల్లోకి ఎగిరి కిందపడ్డాయి. గాలి - వేగానికి దుకాణాల్లో వస్తువులు బయటకు ఎగిరి పడ్డాయి. భారీ చెట్లు నేల కూలాయి. విద్యుత్ స్తంభాలు కూలాయి. భీకర గాలుల తీవ్రతతకు ఎల్ఐసీ కార్యాలయం నామ ఫలకాలు గాలిలో ఎగిరి పడ్డాయి. గోదావరిలో అలలు సముద్రం మాదిరి ఎగిసి పడ్డాయి. జనం ప్రాయభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
వీరభద్రపురంలో కంటిపూడి రామారావు మున్సిపల్ పాఠశాలలో నాడు-నేడు పనుల్లో భాగంగా రెండవ అంతస్తు పైన వేసిన రేకుల షెడ్డు ఎగిరి కింద పడింది. విద్యార్థులకు సెలవులు మంజూరు చేయడంతో ప్రమాదం తప్పింది. పనుల్లో నాణ్యత లోపించడం కారణంగా షెడ్డు పడిపోయినట్లు అర్బన్ టీడీపీ నాయకులు ఆరోపించారు. సంఘటనా స్థలాన్ని టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి వాసు పరిశీలించారు.