Tomato Prices ఆధార్ కార్డు తీసుకురండి..! సబ్సిడీ టమోటాలు తీసుకెళ్లండి..! రంగంలోకి ఏపీ మార్క్ఫెడ్
Tomato Prices: మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా టమాటా ధరలు భారీగా పెరగడంతో.. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా పంట నష్టపోవడంతో.. వారం రోజుల్లోనే టమాటా భారీగా పెరిగింది. వర్షాలకి తోడు వేడి గాలుల ప్రభావం వల్ల పంట దిగుబడి తగ్గిపోయి మార్కెట్లో టమాటాకు డిమాండ్ పెరిగింది. కిలో టమాటా మదనపల్లి మార్కెట్లో 120 రూపాయలు పలకడంతో.. ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రభుత్వం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రాయితీపై కిలో 50 రూపాయలకు విక్రయిస్తుంది. టమాటాలను రైతు బజార్ ద్వారా కొనుగోలుదారులకు.. గత మూడు రోజులుగా అందిస్తోంది. ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 6 గంటల నుంచే లైన్లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేస్తున్నారు. కిలో టమాటా కోసం.. గంటల తరబడి వేచిచూస్తున్నారు. ఆధార్ కార్డుకు ఒక కిలో చొప్పున టమాటా ఇస్తుండటంతో.. నలుగురు, అయిదుగురు ఉన్న కుటుంబాలలో.. ప్రస్తుతం ఇస్తున్న కిలో టమాటా రెండు రోజులకు కూడా సరిపడవని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.