Movie actor Naga Chaitanya: 'మన కథ నిజాయితీగా తీస్తే.. అదే ఆటోమేటిక్‌గా ప్యాన్ ఇండియా అవుతుంది' - Visakhapatnam District political news
Tollywood Hero Naga Chaitanya In Vizag: టాలీవుడు నటుడు నాగ చైతన్య కస్టడీ సినిమా ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖలో సందడి చేశారు. వైజాగ్ అంటే తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. వైజాగ్‌లో చిత్రికరించిన ప్రతి సినిమా చాలా బాగా ఆడిందని గుర్తు చేశారు. వైజాగ్ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి ఇక్కడి వారు తనను, తన సినిమాలకు చక్కని మద్దతు ఇస్తూ, విజయతీరాలకు నడిస్తున్నారని నాగ చైతన్య ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కస్టడీ హీరో నాగ చైతన్య మాట్లాడుతూ..''కస్టడీ సినిమా చిత్రీకరణ ఇక్కడ జరగకపోయినా.. ప్రచారానికి కచ్చితంగా రావాలని విశాఖకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. కస్టడీ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందనే ఆశాభావం నాలో ధృడంగా ఉంది. వైజాగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ నుంచి నాకు ఎంతో సపోర్ట్ ఉంది. విశాఖ నాకు సెంటిమెంట్‌గా అయిపోయింది. కస్టడీ చిత్రం మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేను తాజాగా చిత్రాన్ని చూశాను. చాలా బాగా వచ్చిందని సినిమా. డైరెక్టర్ వెంకట్ ప్రభు స్క్రీన్‌ప్లే చక్కగా ఇచ్చారు. సంగీత దర్శకులు ఇళయరాజ గారు సినిమాకు చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం.. యాక్షన్ సీక్వెన్స్‌కు అవసరమైన లెన్త్ కూడా ఇచ్చాం.'' అని ఆయన అన్నారు.
అనంతరం ఈ సినిమాలో నటీమణిగా నటించిన కృతి శెట్టితో ఇది రెండోవ సినిమా అని..హీరో, హీరోయిన్ మధ్య సినిమాలో మంచి కెమిస్ట్రీ వచ్చిందని నాగ చైతన్య తెలిపారు. కస్టడీ అని పేరు ఎందుకు పెట్టామో ట్రైలర్‌లో కొంచెం చూపామని.. సినిమా పూర్తిగా చూస్తే అర్ధమవుతుందని పేర్కొన్నారు. ఒక కానిస్టేబుల్ రైజ్ అయితే ఎలా వుంటుందో ఈ చిత్రం ద్వారా చూడొచ్చన్నారు. సినిమా 40 నిమిషాల తర్వాత యాక్షన్ మూడ్‌లోకి వెళుతుందని.. ఎంటర్‌టైన్మెంట్ కూడా విడిచిపెట్టలేదని తెలిపారు. మన కథ నిజాయితీగా తీస్తే అది ఆటోమేటిక్‌గా ప్యాన్ ఇండియా చిత్రం అవుతుందని నటుడు నాగ చైతన్య తన అభిప్రాయాలను వెల్లడించారు.