Toddy Tappers Protest: హామీలిచ్చారు.. అమలు మరిచారు.. కల్లుగీత కార్మికుల ఆందోళన - AP Latest News
Kallu Geetha workers Protest: కల్లుగీత కార్మికులకు 2022లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 693ని వెంటనే అమలు చేయాలని.. కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కల్లుగీత వృత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ఎనికేపాడులోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కల్లుగీత కార్మికులు తాడిచెట్టు మీద నుంచి పడి చనిపోతే ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారని.. కానీ ఆ జీవో 693 ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని.. కల్లుగీత కులాల వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లారి గణేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంద మందికి పైగా కల్లుగీత కార్మికులు ఎనికేపాడులోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి.. కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ అన్ని కులాల వారికి చేతివృత్తులదారులకు జగనన్న చేదోడు పథకం రూపంలో పదివేల రూపాయలు ఇస్తున్నారు కానీ.. కల్లుగీత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఆ పథకం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో కల్లు గీత కార్మికులకు అనేక వాగ్దానాలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. వాటిని నెరవేర్చక పోవడం శోచనీయమని వెంటనే తమ న్యాయమని డిమాండ్లను నెరవేర్చాలని ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులు డిమాండ్ చేశారు.