కోటప్పకొండలో తిరునాళ్లు.. పలు గ్రామాల నుంచి తరలివస్తున్న విద్యుత్ ప్రభలు
Kotappakonda Sri Trikoteswaraswamy Tirunallu: మహాశివరాత్రి తిరునాళ్ల కోసం పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎంతో చరిత్ర, ప్రాభవం గల ఈ కోటప్పకొండ.. పర్యాటకంగా ప్రసిద్ది పొందింది. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. భక్తుల తాకిడి దృష్ట్యా ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా రేపు తిరునాళ్ల మహోత్సవం ఘనంగా జరగనున్నాయి. ఏటా నిర్వహించే ఈ తిరునాళ్ల వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి కోటప్పకొండకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈనేపథ్యంలో కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లకు పరిసర గ్రామాలైన యల్లమంద, గురవాయిపాలెం, కాకాని, అమీన్ సాహెబ్ పాలెం, యడవల్లి, తదితర గ్రామాల నుండి శుక్రవారం భారీ విద్యుత్తు ప్రభలు బయలుదేరాయి. ప్రభల రాకలతో కోటప్పకొండ, యల్లమంద ప్రధాన రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచింది. ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రప్రభుత్వం అధికారికంగా:కోటప్పకొండపై శివరాత్రి ఉత్సవాలు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇటీవల అన్నదాన శాలను ప్రారంభించారు. విగ్రహాలకు రంగులు వేయడంతో కోటప్పకొండ మెరిసిపోతూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. కేవలం శివరాత్రి, కార్తీకమాసం పర్వదినాల్లోనే కాకుండా.. కోటప్పకొండపై ఏడాదంతా భక్తులను రప్పించేందుకు పలు అభివృద్ధి పనులను చేపట్టారు. కొండ దిగువభాగంలో పిల్లలపార్కు, కాళింది మడుగు, బోటు షికారు వంటివి ఏర్పాటు చేశారు. వివిధ రకాల జంతువులు, పక్షులతో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శన శాల మహిళలు, పిల్లలను ఆకట్టుకుంటోంది. కోటప్పకొండను కేవలం ఆధ్యాత్మికంగానే కాదు.. అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. శివరాత్రికి ముందుగానే త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. శివరాత్రి పర్వదినాన త్రికోటేశ్వరుడిని దర్శించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మొక్కులు తీర్చడానికి పెద్ద పెద్ద విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలను కూడా శివయ్య వద్దకు తీసుకువస్తున్నారు.