Tirumala Income: మే నెలలో 23 లక్షల భక్తులు.. రూ.110 కోట్ల ఆదాయం..
TTD Hundi Collection: మే నెలలో శ్రీవారిని 23.38 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని.. హుండీ కానుకల ద్వారా 109 కోట్ల 99 లక్షల ఆదాయం వచ్చిందని.. తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. పద్మావతి హృదయాలయంలో 20 నెలల వ్యవధిలో 14 వందల 50 మంది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించామని తితిదే ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
ప్రాణదాన ట్రస్టు సహకారంతో ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాతో సమీక్ష నిర్వహించామని తితిదే ఈవో ధర్మారెడ్డి చెప్పారు. భక్తుల భద్రతను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. తితిదే ఉద్యోగాల పేరిట సామాజిక మాధ్యమాల్లో కొంత మంది వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, అలాంటి వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల టైమ్ పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం 87,434 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో ఆదివారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చింది.