అడవిరాజు గారు వచ్చారు.. ఎక్కడివారు అక్కడే ! ఆదిలాబాద్‌లో పులుల సంచారం.. వీడియో వైరల్
Tigers wander in GollaGhat village : తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ శివారులో నిన్న అర్ధరాత్రి నాలుగు పులులు రోడ్డు క్రాస్ చేశాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ టిప్పర్ డ్రైవర్ వాటిని గమనించి తన మొబైల్లో ఆ చిత్రాలను బంధించాడు. ప్రస్తుతం అవి సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tigers wandering in Adilabad : ఆదిలాబాద్‌లోని పిప్పల్ కోటి రిజర్వాయర్ పనుల కోసం ఓ టిప్పర్ డ్రైవర్ మట్టిని తరలిస్తున్నాడు. ఆ క్రమంలో గొల్లఘాట్ సమీపంలో నాలుగు పులులు రోడ్డు దాటడాన్ని గమనించాడు. వెంటనే ఆ ఫొటోలను తన మొబైల్లో రికార్డు చేశాడు. అనంతరం బ్యారేజీ పనుల పర్యవేక్షణ అధికారికి సమాచారం అందించాడు. పులుల సమాచారం అందుకున్న అధికారి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
పులులు సంచరిస్తున్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని.. అవి రోడ్డు దాటుతున్న దృశ్యాలను పరిశీలించారు. పులుల పాదముద్రలను పరిశీలించి.. వాటి సంచారం నిజమేనని నిర్ధారించుకున్నారు. గొల్లఘాట్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను రాత్రి పూట అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. పులులను పట్టుకునే వరకు ప్రజలందరూ జాగత్రగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు.
Tigers Roaming In Adilabad: సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో నాలుగు పులులు సంచరించిన సంగతి తెలిసిందే. తిప్పేశ్వర్ అడవి నుంచి పెన్ గంగ దాటుకుని తరచూ ఈ ప్రాంతానికి పులులు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో పనుల నిమిత్తం బయటకు వస్తున్న వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల పులులు మూగజీవాలపై సైతం దాడులకు పాల్పడుతున్నాయి. పులుల సంచారంతో చుట్టపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా వాటిని బంధించాలని అటవీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.