TIGER: బీ అలెర్ట్.. పల్నాడు జిల్లాలో పులుల సంచారం: అటవీశాఖ అధికారి - పల్నాడు జిల్లా లేటెస్ట్ న్యూస్
TIGER MOVEMENTS: పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని దుర్గి మండలం గజాపురంతో పాటు వివిధ ప్రాంతాల్లో పులి సంచారం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు అన్నారు. గురువారం మాచర్ల అటవీ శాఖ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26న ఓ పులి.. దుర్గి మండలం గజాపురం వద్ద అవుపై దాడి చేసిందని ఆయన వెల్లడించారు. నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 75 వరకు పులుల సంచారం ఉన్నట్లు ఆయన తెలిపారు. వైల్డ్ లైఫ్ ప్రాంతమే కాకుండా లోయపల్లి, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
పులి సంరక్షణతో పాటు మనుషుల రక్షణ కూడా తమ బాధ్యత అని చెప్పిన ఆయన.. స్థానికులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులులు ఆహారం, నీటి కోసం బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పులులు అడవిలోనే ఉండేలా సాసర్ పిట్ల ద్వారా నీటిని నింపుతున్నట్లు ఆయన తెలిపారు. పొలాలకు కరెంట్ పెడితే పులులు చనిపోయే ప్రమాదం ఉందని సూచించిన ఆయన.. పులి సంచారం వుండే ప్రాంతాల్లో పొలాలకు కరెంట్ పెట్టడం నేరమని వివరించారు. అలా పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులి సంచార జోన్లలో రాత్రి వేళ కరెంట్ సప్లయ్ లేకుండా విద్యుత్ శాఖ వారితో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. పులి సంచారం వుండే అటవీ ప్రాంతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. స్థానికులు భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలు తెలుసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.