Police suspension: నంద్యాలలో ఏఎస్సైతో సహా ముగ్గురు పోలీసులు సస్పెన్షన్..ఆ పని చేసినందుకే..! - Irregularities in Nandyala Police Department
Police suspension in Nandyala: నంద్యాలలో ఓ ఏఎస్సై తో సహా ముగ్గురు పోలీసులపై వేటు పడింది. గోప్యంగా ఉంచాల్సిన పోలీసు స్టేషన్ సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారని.. అధికారుల అదేశాలను పట్టించుకోకుండా ఉండడం తదితర కారణాలతో శాఖాపరమైన చర్యల్లో బాగంగా వారిని సస్పెన్షన్ చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.. సస్పెన్షన్ అయిన వారిలో ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ ఏ ఎస్సై హషన్ హుసేన్, రెండో పట్టణ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ రవికుమార్, మూడో పట్టణ పోలీసు స్టేషన్ కానిస్టేబుళ్లు కిషోర్, మాధవ్‌లు ఉన్నారు. గతంలో నంద్యాల పట్టణంలో ఇటీవల నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించిన విషయం పాఠకులకు విధితమే. ఆ ముఠాకు, సస్పెన్షన్‌కు గురైన పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హల్‌చల్ చేశాయి. ఎన్జీవో కాలనీకి చెందిన రవికుమార్ అనే కానిస్టేబుల్ రియల్ ఎస్టేట్‌లో స్థలాల విక్రయంలో జోక్యం చేసుకున్నట్లు పోలీసు అధికారులకు బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయి. సస్పెన్షన్‌కు గురైన వారందరికీ నకిలీ డాక్యుమెంట్ల ముఠాతో పరిచయాలు ఉండటం, ఈ విషయం డీఐజీకి తెలియడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసి వారిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. నంద్యాల పోలీసుశాఖలో కొందరికి నకిలీ డాక్యుమెంట్ల ముఠాతో సంబంధం ఉన్న విషయాన్ని బయటకు రాకుండా చేశారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.