వాగు దాటుతుండగా ముంచెత్తిన ప్రవాహం - ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 6, 2023, 7:25 PM IST
|Updated : Dec 7, 2023, 1:06 PM IST
Three Washed Away While Crossing stream: మిగ్జాం తుపాను ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతగిరి మండలంలోని లువ్వావాగు దాటుతుండగా ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో ఓ మహిళ ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీతపాడుకు చెందిన గెమ్మిల్లి కుమార్, మిరియాల కుమార్, గెమ్మిలి లక్ష్మి గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.
వీరిలో కుమార్ మృతదేహం ఉదయం కాశీ పట్టణంలో లభ్యం అయ్యింది. మరో ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు పది గంటలు వెతికి మరో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. వారి మృతదేహాలను స్థానిక ఎమ్మెల్యే ఫాల్గుణ, ఎమ్మెల్సీ రవిబాబు ఇతర ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాశీపట్నం సంతకు వెళ్లి తిరిగివస్తుండగా తుఫాను ప్రవాహంలో చిక్కుకొని ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. భారీగా వరద ప్రవహిస్తుండంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.