Modakondamma Jatara: ఘనంగా మోదకొండమ్మ జాతర మహోత్సవాలు.. భారీగా తరలివచ్చిన భక్తులు
Modakondamma Jatara: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యుత్తు దీపాలంకరణలతో.. అమ్మవారి జాతర కన్నుల పండువగా సాగుతోంది. ఉత్సవాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాలలో మంగళవారం ఆఖరి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరుతున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా జనసందోహంతో కిటకిటలాడుతోంది. ఈ జాతర మహోత్సవంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవానికి విచ్చేసిన భక్తులను ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రతి ఏటా ఈ జాతర మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వైభవంగా జరిపిస్తున్న ఈ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి.. మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు జాతర మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.