Municipal Meeting Postponed: కుర్చీ కోసం వైసీపీ నేతల కుమ్ములాట.. ప్రజాసమస్యలు పట్టవా అని టీడీపీ ఆరోపణ - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వర్గం
Thiruvur Municipal Meeting Postponed: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఛైర్మన్ పదవీ ఒప్పందం అమలు చేయాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వర్గం మరోసారి పురపాలక సంఘం సమావేశానికి దూరంగా ఉంది. దీంతో వరుసగా రెండోసారి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఛైర్ పర్సన్ కస్తూరిబాయి ప్రకటించారు. అధికార పక్ష సభ్యుల తీరు పట్ల ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మండిపడ్డారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి అధికార వైసీపీ సభ్యులు కుర్చీ కోసం కుమ్ములాడుకుంటున్నారని ఆరోపించారు. పట్టణ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని, కృష్ణా జలాలు అందించే పథకం నిర్మాణ పనులు నిలిచిపోయాయని, అభివృద్ధి కుంటు పడుతుందని దుయ్యబట్టారు. తిరువూరు పురపాలక సంఘంలో జరుగుతున్న పరిణామాలు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు.
తిరువూరు పురపాలక సంఘం కార్యాలయంలో 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం కోరం పూర్తికాకపోవడంతో ప్రతిష్టంభించింది. మొత్తం 17 మంది అధికార పార్టీ సభ్యులకు ఛైర్ పర్సన్‌తో కలిపి తొమ్మిది మంది సభ్యులు హాజరయ్యారు. ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు సమావేశం మందిరం బయట నిరీక్షిస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు సమావేశానికి దూరంగా ఉన్నారు. కోరం పూర్తి అయితేనే సమావేశం ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. దీంతో తిరువూరు పురపాలక సంఘం సమావేశం మరోసారి వాయిదా పడింది.