Thieves Targeted 3 Houses : కదిరిలో రెచ్చిపోయిన దొంగలు.. ఒకే రాత్రిలో మూడు ఇళ్లలో చోరీ - Three houses were stolen in one night
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2023, 1:25 PM IST
Thieves targeted 3 houses :శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని అర్ధరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. అడపాల వీధి ప్రాంతంలోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రసాద్ వైద్యం కోసం కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం వెళ్లారు. పక్కనే ఉన్న విశ్రాంత ఉద్యోగి చంద్రశేఖర్ పులివెందులలో ఉన్న కుమార్తె వద్దకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఈ రెండిళ్లకు ఎదురుగా ఉన్న గుణశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శిరిడీకి వెళ్లారు. ఒకే చోట మూడిళ్లకు తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దొంగలు నిన్న తాళాలు పగలగొట్టి దోపిడీకి తెగబడ్డారు. ప్రసాద్ ఇంట్లో 30 తులాల బంగారు నగలు, 2 లక్షల రూపాయలు, మరో విశ్రాంత ఉద్యోగి చంద్రశేఖర్ నివాసంలో 25వేల రూపాయలు, రెండున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. గుణశేఖర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు 10 తులాల బంగారు ఆభరణాలు పదివేల రూపాయలతో పాటు బైకును అపాహరించుకు వెళ్లారు. గుణశేఖర్ రెడ్డి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు కదిరి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిఎస్పి శ్రీలత పట్టణ పోలీసులు చోరీలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీంలతో చోరీకి సంబంధించిన వివరాలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని డిఎస్పి శ్రీలత తెలిపారు.