TDP, YSRCP war of words : 'ఆరోపణలు నిరూపిస్తే ఏపీ నుంచి వెళ్లిపోతా' - వక్ఫ్ బోర్టు భూమి
TDP, YSRCP war of words : కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పాణ్యం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేయగా.. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పందించారు. తనపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిచిపెట్టి వెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. ఆరోపణలు చేసే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిపారు.
అంతకుముందు టీడీపీ నాయకులు ఏమన్నారంటే... కాటసాని రాంభూపాల్ రెడ్డి కబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో గౌరు చరిత, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోట్ల సుజాతమ్మ, బీటీ నాయుడు, బీవీ జయనాగేశ్వరరెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాటసాని... కర్నూలులోని 554 సర్వే నంబర్ లో వక్ఫ్ బోర్టు భూమి పది ఎకరాలా 64 సెంట్లు కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. 2006వ సంవత్సరంలో కర్నూలు వెంకట శివసాయి నగర్ లో ఓ వెంచర్ లో చిరుద్యోగులు ప్లాట్లు తీసుకుంటే... ఆ స్థలాలు సైతం కబ్జా చేశారని, దూపాడులో 4 వందల మంది పేదలకు ఇచ్చిన 10 ఎకరాల స్థలాన్ని హస్తగతం చేసుకున్నారని విమర్శించారు. కర్నూలు మేయర్, కాటసాని కలిసి పార్కులు కబ్జా చేశారని, పాణ్యం నియోజకవర్గంలో తాము అభివృద్ధిని చేస్తే... కాటసాని కబ్జాలకు పాల్పడుతున్నారని గౌరు చరిత ఆరోపించారు. దీనిపై ప్రమాణం చేయటానికి సిద్ధమని సవాలు విసిరారు.