Demolition Of TDP Leader Shop In Arugolanu : 'టీడీపీ నాయకుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడని కక్ష సాధింపు' - కక్ష సాధింపు
TDP Leader Srinivasa Rao Shop Demolished In Arugolanu : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆరుగొలనులో టీడీపీ నేత, తిప్పనగుంట సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మాదల శ్రీనివాసరావుకు చెందిన దుకాణ సముదాయాన్నిఅధికారులు జేసీబీతో కూల్చేశారు. ఉదయమే జేసీబీతో దుకాణం వద్దకు వచ్చిన అధికారులు ప్రహరీని కూల్చేశారు. వెంటనే ఖాళీ చేయకుంటే పూర్తిగా తొలగిస్తామని చెప్పి వెళ్లిపోయారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ వచ్చిన అధికారులు దుకాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ సమయంలో ఎవరూ అటుగా రాకుండా పోలీసు బందోబస్తు పెట్టారు. ఆదిత్య ట్రేడర్స్ పేరుతో పురుగు మందుల దుకాణం నిర్వహిస్తున్న ఈ సముదాయాన్ని ఐదేళ్ల క్రితం స్థానిక హైస్కూల్ ఎదురుగా ఉన్న 4 సెంట్ల స్థలంలో శ్రీనివాసరావు నిర్మించారు.
అయితే రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం పోరంబోకుగా ఉందని, భవనం నిర్మించినట్లు ఫిర్యాదులు వచ్చాయని బాపులపాడు తహసీల్దార్ నరసింహారావు తెలిపారు. వెంటనే భవనం నిర్మాణాన్ని తొలగించాలంటూ గత నెల 24న ఓసారి, ఈనెల 1న మరోసారి నోటీసులు ఇచ్చామని అయినా స్పందన లేకపోవడంతో కూల్చేశామని వెల్లడించారు. శ్రీనివాసరావు మాత్రం తనకు కూల్చేముందు మాత్రమే నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాను చీపురుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద స్థలాన్ని కొన్నానని, దానికి ముందే కొంతమంది చేతులు మారిందని చెప్పారు. భవనం అక్రమమైతే విద్యుత్ కనెక్షన్ ఎలా ఇచ్చారని, పన్ను ఎందుకు కట్టించుకున్నారని ప్రశ్నించారు..
గతంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడిగా శ్రీనివాసరావు ఉన్నారు.ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో ఆయనకు స్వాగతం పలుకుతూ శ్రీనివాసరావు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కారణంతోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి దుకాణాన్ని పడగొట్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా కక్షసాధింపు ధోరణేనని విమర్శించారు.
TAGGED:
JCB Culture in gananvaram