Tidco houses YSRCP politics : ఎన్నికల వేళ టిడ్కో ఇళ్ల రాజకీయం... వసతులు మరిచి.. పార్టీ రంగులతో హడావుడి.. - టిడ్కో ఇళ్లు
YSRCP politics with the colors of Tidco houses : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం... ఎన్నికల సంవత్సరంలో మాత్రం హడావుడి చేస్తోంది. నాలుగున్నరేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం గుడివాడలోని మల్లాయపాలెం వద్ద 9,812 టిడ్కో ఇళ్లను నిర్మించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ వాటిని మూలకు పడేసింది. తెలుగుదేశం, వామపక్షాల పోరాటంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. ప్రతిదీ ప్రచార యావతో చూసే వైఎస్సార్సీపీ సర్కార్... టిడ్కో ఇళ్లనూ వదల్లేదు. భవనాలకు పార్టీ జెండాలను పోలిన రంగులేసి, ప్రాంగణంలో భారీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇళ్లను ప్రారంభిస్తామంటూ వాటిని వైఎస్సార్సీపీ కార్యాలయాలుగా మార్చేసి.. సీఎం ఫ్లెక్సీలను మూడంతస్తుల భవనాలకు కింది నుంచి పైవరకు భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. కింది వరుసలోని ఇళ్ల కిటీకీల అద్దాలకూ జగన్ చిత్రాలే అతికించడంతో పాటు.. గోడలు ఖాళీ దొరికితే చాలు ఫ్లెక్సీలతో నింపేశారు. ఇంతా చేసి ఇళ్లల్లో కనీస వసతులు అందుబాటులోకి తెచ్చారా అంటే.. ఆ ఊసే లేదు. నీళ్లిచ్చే ట్యాంకు నిర్మాణంలోనే ఉండగా.. కరెంట్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ పనుల ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మొత్తంగా సౌకర్యాలు, కనీస వసతుల కల్పనను పట్టించుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఇళ్లను మాత్రం ప్రచార వస్తువుగా మార్చేసింది.