Four Years Degree details: విద్యార్థులకు గమనిక: ఇకపై డిగ్రీ మూడేళ్లు కాదు.. నాలుగేళ్లు: హేమచంద్రా రెడ్డి - Andhra Pradesh degree course news
AP Higher Education Chairman Comments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2023-34) ఒక సబ్జెక్ట్ ప్రధానంగా ఉండే డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని.. డిగ్రీ కోర్స్ స్వరూపం మారబోతుందని.. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. ఎవరైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సు (బీఏ, బీకాం, బీఎస్సీ)లో చేరాలని ఆశగా ఎదురుచూస్తున్నారో.. అటువంటి విద్యార్థులకు ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.
డిగ్రీ స్వరూపం మారబోతుంది..ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ..''వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ స్వరూపం మారబోతుంది. ఇప్పటి వరకు మూడు సబ్జెక్టులు ప్రధానంగా ఉండగా.. ఇకపై ఒకే సబ్జెక్టు ప్రధానంగా ఉంటుంది. అంటే.. బీఏ, బీకాం, బీఎస్సీలో నాలుగో ఏడాది స్టడీని రెండు రకాలుగా చేస్తాం. మూడేళ్ల తర్వాత వారికి అప్షన్ ఉంటుంది. ఇష్టం ఉంటే నాలుగో ఏడాది చదువొచ్చు, లేనియెడల మూడేళ్ల డిగ్రీని తీసుకుని వెళ్లిపోవచ్చు. మరొకటి మైనర్ సబ్జెక్టుగా కొనసాగుతుంది. ప్రస్తుతం (2020-21) అందుబాటులో ఉన్న ఈ 4 ఏళ్ల డిగ్రీ కోర్సు విద్యార్థులు.. ఈసారి నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తారు. ఆ విద్యార్థులు (ఈసారి నాలుగో ఏడాదిలోకి వెళ్తున్నవారు) కావాలంటే మూడేళ్ల డిగ్రీ తీసుకుని వెళ్లిపోవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు 4 ఏళ్ల డిగ్రీని కొనసాగించవచ్చు. ఈ 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసినవారికి.. ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తాం'' అని ఆయన అన్నారు.
ఆనర్స్ డిగ్రీ పూర్తి చేస్తే లాభాలు-అర్హతలు..అయితే, ఈ 4 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉండబోయే లాభాలను, అర్హతలను కూడా ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రా రెడ్డి వెల్లడించారు. 'ఎవరైతే నాలుగో ఏడాది కూడా చదువుతారో వారికి ఆనర్స్ డిగ్రీని అందజేస్తాం. ఈ ఆనర్స్ డిగ్రీ మళ్లీ రెండు స్ట్రీమ్‌ల్లో ఉంటుంది. ఒకటి.. ఆనర్స్ రీసెర్చ్ డిగ్రీ. రెండవది..కేవలం ఆనర్స్ డిగ్రీ ఉంటుంది. ఎవరైతే ఆనర్స్ డిగ్రీ చేస్తారో.. వారికి పీహెచ్‌డీ అడ్మిషన్‌కి అవకాశం (అర్హత) కల్పిస్తాం. ఈ ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసినవారికి మరొక అవకాశం ఏంటంటే.. పీజీ పోగ్రామ్‌కి డైరెక్ట్‌గా వెళ్లొచ్చు. వీరికి పీజీ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఈ ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులకు యూనిర్సిటీలలో చదువుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం' అని ఆయన తెలిపారు.
యూజీసీ నిబంధనల మేరకే.. ఆంధ్రప్రదేశ్‌లో ఒకే సబ్జెక్ట్ ప్రధానంగా ఉండే డిగ్రీ కోర్సులను అధికారులు ఎందుకు ప్రవేశపెట్టానున్నారు అనే వివరాల్లోకి వెళ్తే.. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనలు మేరకు ఈ నూతన విద్యా విధానాన్ని అధికారులు అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఇకపై సింగిల్ సబ్జెక్ట్ ప్రధానంగా డిగ్రీ కోర్సులు కొనసాగనున్నాయి. ఇప్పటికే ఈ విధానం తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో అమలులో ఉంది. ఈ ఏడాది నుండి ఏపీలోనూ అమల్లోకి రానుంది.