solar power charging: రాష్ట్రంలో సౌర విద్యుత్ చార్జింగ్ కేంద్రాలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ - సౌర విద్యుత్ ఛార్జింగ్
solar power charging centers: కేంద్ర ప్రభుత్వం కొత్తగా సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానుంది. హరిత నగరాల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా... అనంతపురం, విజయవాడ, తిరుపతి నగరాల్లో 12 సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది. ఈ మేరకు 95 లక్షల రూపాయలను విడుదల చేసింది. కార్డు ద్వారా డబ్బు చెల్లించి వాహనదారుడే ఛార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించగా.. వీటి ఏర్పాటు పనులను పునరుత్పాదక ఇంధన వనరులశాఖ పర్యవేక్షిస్తుంది. ఇప్పటివరకు విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు మాత్రమే వాహన వినియోగదారులకు అందుబాటులో ఉండగా... సౌర విద్యుత్ ప్యానళ్లతోనే ఛార్జింగ్ కియోస్క్‌లను ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. సౌర ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బ్యాటరీలో నిల్వ ఉంటుంది. దానిని తిరిగి వాహనాల ఛార్జింగ్ కోసం వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఛార్జింగ్ సేవలు పొందడానికి వెండింగ్ మిషన్ ద్వారా పేమెంట్ చేసుకునే వీలుంటుంది. పెట్రోలు వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాహన కాలుష్యాన్ని నియంత్రించాలని నిర్ణయించిన కేంద్రం.. ఇందులో భాగంగానే సౌర విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.