Tension at Temple Land Auction: దేవాలయ భూముల వేలంలో ఉద్రిక్తత.. ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం
Agitation Against Temple Lands Auction in Pedda Dudyala : ఆ ఊరి ప్రజలు దేవాలయ భూములపై ఆధారపడి ఎన్నో ఏళ్ల నుంచి బతుకుతున్నారు. ఒక్కసారిగా దేవాలయ భూములను అధికారులు వేలం పాట వేయటం ప్రారంభించడంతో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఆ భూములను కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడటం లేదు.
వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం పెద్ద దుద్యాల గ్రామంలో శ్రీ వరదరాజల స్వామి ఆలయం భూములకు వేలంపాట నిర్వహించే క్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి సంబంధించిన 130 ఎకరాల భూములకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నారు. వందేళ్ల నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూములకు ఇప్పుడు వేలంపాట నిర్వహించడం ఏమిటని, సాగు చేసుకుంటున్న గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వేలంపాట నిర్వహించకూడదని పట్టు పట్టారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే దేవాదాయ శాఖ అధికారులు ఆలయం భూములకు వేలంపాట నిర్వహిస్తున్నారని గ్రామస్థులు మండిపడ్డారు. వేలంపాట నిర్వహిస్తే తమ జీవనోపాధి దూరం అవుతుందని భావించిన మహిళలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు.
ఈ సమయంలో ఇద్దరు మహిళలు పోలీసుల ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఓ మహిళ నుంచి పురుగు మందు డబ్బా లాక్కున్నారు. పోలీసులు ఎంత చెబుతున్నా వినకుండా మరో మహిళ పురుగు మందు తాగింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో యువకుడు కిరోసిన్ పోసుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రామంలో గొడవలు పెట్టడానికి ఇప్పుడు వేలంపాట నిర్వహిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు భారీగా చేరుకుని గ్రామస్తులను చెదరగొట్టారు. వలం వేలంపాటలో పాల్గొనే వారిని మాత్రమే ఆ ప్రాంతంలో ఉండే విధంగా హుకుం జారీ చేశారు.