Mekapati Vikram: కాళ్లు పట్టుకున్నా కనికరించని పోలీసులు.. బాధితుడ్ని లాగి పారేసి
Revenue Conference in Nellore Atmakur: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ఉద్రిక్తతకు దారి తీసింది. తన భూమిని వైసీపీ నేత అక్రమించుకున్నారని ఓ బాధితుడు వాపోయాడు. అధికారుల చూట్టూ ఎన్నిసార్లు తిరిగినా తనకు న్యాయం జరగటం లేదని.. చివరకు ఎమ్మెల్యే ముందు.. రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకోవటానికి వచ్చానని తెలిపాడు. అక్కడ కూడా తనకు నిరాశే ఎదురైందని వాపోయాడు. స్వయాన ఎమ్మెల్యే ముందు అధికారులకు విన్నవించుకుందామనుకున్నా.. ప్రయత్నం ఫలించలేదన్నాడు. చివరి ప్రయత్నంగా పోలీసుల కాళ్లు పట్టుకున్నా వాళ్లు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎమ్మెల్యేకు తన భూసమస్యను చెప్పుకునేందుకు వచ్చిన మహబూబ్ బాషా అనే వ్యక్తికి పోలీసులు మైక్ ఇవ్వకుండా లాక్కున్నారు. దీంతో తన సమస్యను గట్టిగా చెప్పుకునేందుకు అతను ప్రయత్నించాడు. బాధితుడు తన సమస్యను చెప్పుకోనివ్వకుండా పోలీసులు బయటకు తోసేశారు. బాధితుడు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. వైసీపీ నేత శ్రావణ్ కుమార్ తన భూమిని ఆక్రమించి.. రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఆర్డీవో కరుణకుమారి, తహశీల్దార్ హేమంత్ కుమార్ స్పందించలేదన్నాడు. శ్రావణ్ కుమార్ వద్ద లంచాలు తీసుకొని తనకు న్యాయం చేయటం లేదని బాధితుడు వాపోయాడు. రెవెన్యూ సదస్సును తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. తాను భూమిని నిజాయితీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నానని.. తన భూమిని వైసీపీ నేత అక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయాడు.