Tension in Ponnur: ఇళ్ల తొలగింపులో ఉద్రిక్తత.. అధికారులను నిలదీసిన మాజీ ఎమ్మెల్యే.. పోలీసుల వాగ్వాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 1:41 PM IST
Tension in Ponnur: గుంటూరు జిల్లా పొన్నూరులో అవ్వారు ఆదిమ సత్రం స్థలంలో నివాసాల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులను ఖాళీ చేయించి.. స్థలం స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇళ్లు తొలగించేందుకు అధికారులు యత్నించగా.. స్థానికులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవ్వారు ఆదిమ సత్రం స్థలంలో నాలుగు దశాబ్దాలుగా పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని ఇళ్ల నుంచి ఎలా ఖాళీ చేయిస్తారని ఆయన ప్రశ్నించారు. వారిని ఇళ్లు ఖాళీ చేయించడానికి.. తమ వద్ద ఉన్న సంబంధిత పత్రాలు చూపాలని నరేంద్ర అధికారులను కోరారు. సమాధానం ఇవ్వకుండా అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో.. స్థానికులతో కలిసి నరేంద్ర వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగేయడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.