సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత - అల్లరి మూకలు చేరి - సోమిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 10:26 PM IST
Tension at Somireddy Initiation Camp: నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, టీడీపీ నేత చేపట్టిన దీక్ష ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు అల్లరి మూకలు చేరి దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సోమిరెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా అక్కడకు మీడియాను కూడా రాకుండా వారు అడ్డుకున్నారు. జిల్లాలోని పొదలకూరు మండలం వరదపురంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ దానిని మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష చేపట్టారు. ఈ దీక్ష ప్రాంగణం వద్దకు సోమవారం సాయంత్రం సుమారు 200 మంది హిజ్రలు, అల్లరి మూకలు చేరుకున్నారని టీడీపీ నేతలు వివరించారు. వారు దీక్ష చేపట్టిన ప్రాంతాన్ని చుట్టుముట్టి దీక్షను భగ్నం చేసేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఈ క్రమంలో అక్కడ ఉన్న టీడీపీ నేతల కార్ల అద్దాలు, సోమిరెడ్డి కారు అద్దాలను పగలగొట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనను చిత్రికరించడానికి వచ్చిన మీడియా ప్రతినిధుల ఫోన్లను లాక్కున్నారు. చివరకు దీక్ష శిబిరాన్ని తొలగించడానికి యత్నించగా, టీడీపీ నాయకులు ప్రతిఘటించి అడ్డుకున్నట్లు తెలిపారు. దీక్ష శిబిరం వద్ద చేరుకున్న పోలీసులు, గొడవలు జరగడానికి అవకాశం ఉందని సోమిరెడ్డిని దీక్ష విరమించాలని కోరారు. చివరకు ఐదుగురు మాత్రమే దీక్ష శిబిరం వద్ద ఉండాలని మిగతా వారు అక్కడ ఉండకూడదని పంపించి వేసినట్లు తెలిపారు.
TAGGED:
మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష