Tension at JC House in Tadipatri : తాడిపత్రిలో రోడ్డు వివాదం.. జేసీ ఇంటి వద్ద ఉద్రిక్తత - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
Police Stationed Around JC Residence: అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తనఇంటి ముందున్న రోడ్డును వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. 20 అడుగుల మేర తవ్వించి ప్రభుత్వ కళాశాల ప్రహారీ నిర్మిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 60 అడుగుల రోడ్డు ఉండగా.. అందులో 40 అడుగులు ఉంచి.. 20 అడుగుల రోడ్డును తొలగించారన్నారు. పట్టణ ప్రణాళిక ప్రకారం 60 అడుగుల రోడ్డు ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా రోడ్డు కుదిస్తున్నాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కొంతమంది కళాశాల ప్రహరీ నిర్మాణం కోసం తీసిన గుంతలను పూడ్చివేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందస్తుగా పెద్ద సంఖ్యలో జేసి ఇంటి వద్దకు చేరుకున్నారు. కార్యకర్తలను అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చి నిబంధనల మేరకు ప్రహరీ నిర్మిస్తే తమకేమీ ఇబ్బంది లేదని, అనాలోచిత నిర్ణయాలతో నిబంధనలను అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.