Tension in Amalapuram: అమలాపురంలో టెన్షన్.. కార్యకర్తను పోలీసులు కొట్టారని జనసైనికుల ఆందోళన - ap political news
Tension At Amalapuram Police Station : అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తను పోలీసులు కొట్టారని జనసైనికులు పోలీసుస్టేషన్ దగ్గరకు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు, జనసైనికుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొన్ని రోజుల క్రితం ఓ సభలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి జోగి రమేష్‌పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కోనసీమ జిల్లా అమలాపురంలో జోగి రమేష్ పర్యటన ఉందని తెలుసుకుని జనసైనికులు తరలివచ్చారు. మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ అమలాపురం పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి కార్యకర్తలు, వీర మహిళలు ఆందోళన చేపట్టారు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న జనసైనికులపై పోలీసులు మరోసారి దురుసుగా ప్రవర్తించారని, రాజోలుకు చెందిన ఓ జనసైనికుడిపై పోలీసులు చేయి చేసుకున్నారని వారు ఆరోపించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తీవ్ర స్థాయికి చేరుకుంది. పోలీసులు ప్రవర్తనను తప్పుబడుతూ అమలాపురం పోలీస్‌స్టేషన్‌కు భారీ సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు తరలివచ్చారు. దీంతో స్టేషన్ వద్ద పోలీసులకు, జనసైనికులకు తీవ్రంగా తోపులాట జరిగింది. అరెస్టు చేసిన జనసైనికులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.