Temple land Kabja: వైసీపీ నాయకుల అండ.. ఆలయ భూమిపై పూజారి కన్ను.. గ్రామస్థుల ఆందోళన - temple land Kabja in Salkapuram
Temple land Kabja in Salkapuram: వైఎస్సార్సీపీ నేతల అవినీతి అక్రమాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. రాజకీయ బలం, అధికారుల అండదండలతో ఖాళీ స్థలాలు, కాలువలు, గుట్టలు, శ్మశానాలు అన్నింటినీ ఆక్రమించేస్తున్నారు.. ఎక్కడిబడితే అక్కడ దొరికిన కాడికి దోచేస్తున్నారు. దీంతో సామాన్యుల జీవనాధారం కష్టతరంగా మారుతోంది. కర్నూలు జిల్లాలోని వైసీపీ నాయకుల నుంచి తమ గ్రామ దేవాలయ భూములను కాపాడాలని గ్రామస్థులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జిల్లాలోని సల్కాపురం గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి చెందిన 15 ఎకరాల భూమి ఉందని.. ఆ పొలాన్ని వైసీపీ నాయకుల అండతో దేవాలయ పూజారే కబ్జా చేసేందుకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై పాణ్యం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లినా.. తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారి కోరారు. దేవాలయ భూములను కాపాడాలని దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.