Telugu Yuvatha Protest: 'ఉద్యోగాలు రావాలంటే.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి..'
Telugu Yuvatha Protest in Vijayawada : జగన్ ఎన్నికలను ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చి, అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు మరిచి.. మడమ తిప్పాడని నిరుద్యోగులు అంటున్నారు. రాష్ట్రంలో ఉన్న యువత ఓట్లతో సీఎం అయిన జగన్.. నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని వారు ఆరోపిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని బుధవారం తెలుగు యువత ఆధ్యర్యంలో నిరుద్యోగులు నిరసన తెలిపారు.
ఉరితాళ్లు వేసుకుని నిరుద్యోగులు నిరసన : జాబ్ క్యాలెండర్ కోసం తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.. నిరుద్యోగుల పాలిట శాపంగా మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ నాలుగు సంవత్సరాల పాలనలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని.. అందుకే మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలుపుతున్నామని నిరుద్యోగులు అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 35 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆరోపించారు. 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 'నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. జాబు రావాలంటే జగన్ దిగిపోవాలి.. జాబు రావాలంటే బాబు రావాలి.. జాబ్ ఇస్తావా.. రాజీనామా చేస్తావా' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని తెలుగు యువత డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
TAGGED:
విజయవాడలో తెలుగు యువత నిరసన