జగన్ హామీలన్నీ నీటి మూటలే: తెలుగు యువత
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 8:18 PM IST
Telugu Youth Protest in Guntur: సీఎం జగన్ మాటలన్నీ నీటి మూటలేనని తెలుగు యువత గుంటూరులో నీటి మూటలతో వినూత్న నిరసన చేశారు. జాబు క్యాలెండర్, మెగా డీఎస్సీ, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశారంటూ ఆరోపించారు. నీరు నింపిన ప్లాస్టిక్ సంచులను తలపై పెట్టుకుని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలవరం నిర్మిస్తామని, ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశారంటూ మండిపడ్డారు. దీంతోపాటు సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించి నిలువునా ముంచారన్నారు.
సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి బుడగలుగా మారిపోయాయని తెలుగు యువత నేతలు విమర్శించారు. నిరుద్యోగ రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారంటూ నీటి సంచులను నెలకు కొట్టి నిరసన వ్యక్తం చేశారు.
"సీఎం జగన్ మాటలన్నీ నీటి మూటల్లాగా మిగిలిపోయాయి. జాబు క్యాలెండర్, మెగా డీఎస్సీ, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మోసం చేశారు. నిరుద్యోగ రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది." - రావిపాటి సాయికృష్ణ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు