విద్యా బోధన మాతృభాషలో జరిగితేనే అన్ని విధాలా సత్ఫలితాలు: ఆచార్య బేతవోలు రామబ్రహ్మం - Acharya Betavolu RamaBrahman news
Acharya Betavolu RamaBrahman comments: కనీసం 10వ తరగతి వరకూ మాతృభాషలో విద్యా బోధన జరిగితే.. అన్ని విధాలా సత్ఫలితాలు ఉంటాయని.. కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అన్నారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు ప్రాచీన సాహిత్యంలోని పద్య కావ్యాల పట్ల ఆసక్తి కనబర్చడం శుభపరిణామన్నారు. రెండోసారి ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ వరించిన సందర్భంగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు.
మాతృభాషతోనే మంచి భవిష్యత్.. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం మాట్లాడుతూ..''సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారు, విదేశాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు పద్య కావ్యాల పట్ల ఆసక్తి కనబర్చడం శుభపరిణామం. కనీసం 10వ తరగతి వరకైనా మాతృభాషలో విద్యా బోధన జరిగితే అన్ని విధాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆంగ్లం నేర్చుకోవడం, పట్టు సాధించడంలో ఎటువంటి ఆక్షేపణా లేదు. కానీ, పదో తరగతి వరకు మాతృభాషలోనే అధ్యయనం మంచి అవగాహనకు బాటలు వేస్తుంది. యువత ఏదైనా ఏకాగ్రతతో అధ్యయం చేయాలి. సాధన చేస్తే పట్టుబడనిది లేదు. ఇప్పటి యువత సాంకేతికంగా ఎంతో ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారు. అటవిడుపుగా పద్యాలు, లలిత కళల పట్ల అభిరుచిని పెంచుకోవడం ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.'' అని ఆయన అన్నారు.
ఆధునికతరం కోసం ‘పద్య కవితా పరిచయం’..ఆచార్య బేతవోలు రామబ్రహ్మం విషయానికొస్తే.. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించారు. కథలు, కవిత్వం, నాటకాలు కలిపి 34కు పైగా గ్రంథాలు రచించారు. కవిగా, రచయితగా, అనువాదకుడిగా, పండితుడిగా, వ్యాఖ్యాతగా, అష్టావధానిగా, ఉత్తమ గురువుగా, విమర్శకుడు.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. ప్రాచీన, మధ్యయుగపు సాహిత్యంపై వెలువరించిన రచనలు, చేసిన సాహితీ సేవకు గుర్తింపుగా 2021 సంవత్సరానికి గానూ.. ఆయనకు దక్షిణ భారతదేశం నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు అకాడమీ ప్రకటించింది. ఆధునికతరం వారు పద్య సాహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆస్వాదించేలా చేయడం కోసం ‘పద్య కవితా పరిచయం’ పుస్తకాన్ని తీసుకువచ్చారు.