టీడీపీ మహిళా నేత మూల్పూరి కల్యాణి అరెస్ట్.. ఖండించిన చంద్రబాబు - ap news
Mulpuri Kalyani Arrest: తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మధ్య జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన రెండు కేసుల్లో కల్యాణి నిందితురాలిగా ఉన్నారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో అప్పట్నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. హనుమాన్ జంక్షన్‌లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తెల్లవారుజామునుంచే ఇంటిని ముట్టడించి.. అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు, కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను ఇంటి లోపలికి వెళ్లనీయకుండా.. కల్యాణి కుటుంబ సభ్యులు కాసేపు అడ్డుకున్నారు. తరువాత ఇంట్లోకి ప్రవేశించిన తరువాత కూడా కుటుంబ సభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా పోలీసులు కల్యాణిని తీసుకెళ్లేందుకు యత్నించారు. డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పారు. కాసేపటికి కల్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖండించిన చంద్రబాబు: సాయి కల్యాణి అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తప్పుడు కేసు పెట్టిందే గాక.. అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణమని అన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై ఇలానా ప్రవర్తించేది అని ప్రశ్నించారు. హత్య కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు అని చంద్రబాబు విమర్శించారు.
స్పందించిన లోకేశ్: కల్యాణి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల మెప్పు కోసమే తప్పుడు కేసులు పెట్టారని.. ప్రతీ ఒక్కరూ చట్టం ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కల్యాణికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.