Yuvagalam Padayatra @ 1400: మరో మైలురాయికి చేరుకున్న లోకేశ్ పాదయాత్ర.. 1400 కిలోమీటర్లు పూర్తి - YSR District updated news
TDP National General Secretary Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 109 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఈరోజు చేపట్టిన పాదయాత్రతో నారా లోకేశ్ 1400 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయన భారీ జన సందోహం మధ్య నెమల్లదిన్నేలో పైలాన్ ఆవిష్కరించారు.
1400 కి.మీ. మజిలీకి చేరిన యువగళం పాదయాత్ర..టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురం నుంచి 'యువగళం' పేరుతో పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. యువగళం పాదయాత్ర మొదలైన రోజు నుంచి నేటిదాకా అనేక సవాళ్లు, పోలీసుల ఆంక్షలను అధిగమించి.. ఈరోజుతో 109 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఈరోజు పాదయాత్రతో యువగళం పాదయాత్ర 1400 కిలోమీటర్లను పూర్తి చేసుకుంది. దీంతో నారా లోకేశ్ భారీ జన సందోహం మధ్య పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ..''యువగళం పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె వద్ద 1400 కిలోమీటర్ల మజీలిని చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. గండికోట నిర్వాసితులకు ఉపాధిని కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇక్కడి రైతులు, యువతకు ఉపాధి కల్పిస్తానని మాట ఇస్తున్నాను'' అని ఆయన అన్నారు.
గండికోట, రాజోలి బాధితులకు లోకేశ్ హామీ..ఇక నారా లోకేశ్ 109వ రోజు పాదయాత్ర విషయానికొస్తే.. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆయన నేటి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన పెద్దముడియం మండలం సుద్ధపల్లిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి.. గండికోట, రాజోలి జలాశయాల ముంపు బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గండికోట ముంపు వాసులకు రూ.10 లక్షలు, రాజోలి జలాశయం బాధితులకు రూ.12 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గండికోట, రాజోలి బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు, బాధితులకు యువనేత లోకేశ్ హామీ ఇచ్చారు.