Yanamala fire on CM Jagan: ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం.. ప్రజలంతా ఏకం కావాలి: యనమల
TDP Chaitanya Bus Yatra Updates: 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో జూన్ 10వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన చైతన్య బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, మోసాలు, దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేస్తూ.. టీడీపీ నేతలు బస్సు యాత్రను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రోజున అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లక్కవరంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు యనమల రామకృష్ణుడు.. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు.
ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం.. యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ..''ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో ప్రజలందరూ భాగస్వాములై.. అవినీతి, దోపిడీ చేస్తున్న ఈ జగన్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో సాగనంపడానికి సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రజలకు, యువతకు, భావి తరాలకు ఈ జగన్ భవిష్యత్తు లేకుండా పరిస్థితిని సృష్టించారు. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తును కాపాడుకోవడం కంటే మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవటం ముఖ్యం. కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. జగన్ రెడ్డి అధికారం, డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అవినీతి సొమ్ము రూ.3.50 లక్షల కోట్లను ఇడుపులపాయ బంకర్లొ దాచాడు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ అవినీతి సొమ్మును కక్కించి.. ప్రజలకి పంచిపెడుతాం. ప్రస్తుత సంక్షేమ పథకాలను అలాగే ఉంచి, వాటితో పాటు మరిన్ని పథకాలను ప్రవెశపెడతాం'' అని ఆయన అన్నారు.