విశాఖలో 'తెలుగమ్మాయి' ఆడిషన్స్.. అదరగొట్టిన అతివలు - visakha telugammayi auditions news
Telugammayi Auditions at visakha: విశాఖలో తెలుగమ్మాయిలు అదరగొట్టారు. రాంనగర్లోని ఓ హోటల్లో తెలుగమ్మాయి పోటీలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మలు.. బాపూ బొమ్మల్లా, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేటట్లు ముస్తాబై కనిపించారు. కట్టు, బొట్టు, దండ వంకీలు, వడ్డాణాలు, పూలు, గోరింటాకు పెట్టుకుని పదహారణాల తెలుగు అమ్మాయిల్లా అలంకరించుకుని అందరినీ ఆకట్టుకున్నారు. తమ అందచందాలతో పాటు హంస నడకలతో ర్యాంప్ వాక్ చేస్తూ మహిళా శిరోమణులు అదరగొట్టారు. ఈ కార్యక్రమం.. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులు వీరేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ తెలుగమ్మాయి పోటీలలో సుమారు 70 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమలో ఉన్న కళలను ప్రదర్శించారు. కొంతమంది నారీమణులు సంప్రదాయ నృత్యాలు చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో పెళ్లైన, వివాహం కాని మహిళలు పాల్గొనగా.. వారికి విడివిడిగా పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనబర్చిన పలువురిని.. న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసి తెలుగమ్మాయి తదుపరి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.